Join YSR CP IT WING @ http://www.wesupportjagan.com

Saturday, September 1, 2012

వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మతో 'సాక్షి' ఇంటర్వ్యూ

విద్యార్థిగా ఉండగానే జలయజ్ఞాన్ని స్వప్నించారు జనం బాధలను వారి కళ్లు చూసి అర్థం చేసుకునేవారు
కష్టాల్లో ఉండగానే పలకరించాలంటూ పాదయాత్ర చేశారు సీఎం అయ్యాకే మాతో కాస్త సమయం గడిపారు
ఇడుపులపాయ ఎస్టేట్ అంటే ఆయనకు ఎంతిష్టమో! 
ఆ పంచె కట్టు అనితర సాధ్యం.. 



చిరునవ్వు చెరగని ముఖం. మడత నలగని పంచె కట్టు. నేనున్నానని భరోసా కలిగించే మాటతీరు. ఆరునూరైనా మాటపై నిలబడే వ్యక్తిత్వం. ఒక్కమాటలో తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. మనిషి మరణించాక కూడా బతికే ఉండాలని నమ్మిన మహా మనీషి వైఎస్ రాజశేఖరరెడ్డి. దాన్ని జీవితాంతం నమ్మి ఆచరించారు గనుకే జనం గుండెల్లో ఆయన చిరంజీవిగా నిలిచిపోయారు. ‘ఆయన ఓ మంచి నాయకుడు, మంచి తండ్రి, పేదల కోసం తపించిన మనసున్న మహరాజు’ అంటూ వైఎస్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ప్రపంచం అంతా కుటుంబమేనని, ప్రజలంతా కుటుంబీకులేనని అన్నారు. మహానేత మరణించి నేటికి మూడేళ్లు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిత్వం, పనితీరుపై  విజయమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూ...

మూడేళ్లు గడిచిపోయాయా!

ఆయన లేరనుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆయనుంటే ప్రజలకు భరోసా ఉండేది. కష్టమొస్తే నేరుగా కలిస్తే సాయం లభిస్తుందనే నమ్మకముండేది. ఆయన కూడా ప్రజలకు చాలా చేయాలనుకున్నారు. వారికేం చేయాలనుకున్నా వేగంగా ఆలోచించేవారు, పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయంలోనూ ఆలస్యం కూడదన్న గాంధీ హితవే ఆయనకు స్పూర్తి. 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. 1983 తర్వాత 21 ఏళ్లు పెద్దగా పదవులేమీ లేవు. అయినా ఏనాడూ ఆయన ప్రజలకు దూరం కాలేదు. రాష్ట్రంలో ఆయన తిరగని ప్రాంతమే లేదు. ఏ ఊరికి ఏ రోడ్డు వెళ్తుందో తెలుసాయనకు. చిన్న చిన్న ఊళ్లన్నీ కూడా ఆయనకు గుర్తే. కొన్ని లక్షల మందిని పేర్లు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి. వారానికి ఐదు రోజులు బయటే ఉండేవారు. మిగతా రెండు రోజులు కూడా తర్వాతి వారం ఏం చేయాలన్న ప్లానింగ్‌తో గడిచిపోయేవి. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల ఒకే రకమైన మమకారముండేది.


వెంకటప్ప సార్ ప్రభావం

మా మామగారు రాజకీయాల్లో లేకపోయినా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. కొన్ని బై బర్త్ వస్తాయనుకుంటా. వెంకటప్ప గారని టీచర్. ఆయనకు పిల్లల్లేరు. చిన్నప్పటి నుంచీ రాజశేఖరరెడ్డి గారు వాళ్లింట్లోనే పెరిగి చదువుకున్నారు. వెంకటప్ప గారికి కమ్యూనిస్టు భావాలెక్కువ. ఆయన ప్రభావం రాజశేఖరరెడ్డి గారిపై ఉండింది. అందుకే చదువుకునే రోజుల నుంచీ తన ప్రాంత ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని ఆలోచించేవారు. అదే ఆయన్ను రాజకీయాల వైపు నడిపించిందేమో. డాక్టర్‌గా కొందరికే సేవ చేయగలం. రాజకీయాల్లో అయితే ఎందరో పేదల్ని ఆదుకోగలమని అనేవారు. తన ఆలోచనలకు పునాదులేసిన గురువు జ్ఞాపకార్థం పులివెందులలో స్కూలు కట్టించారు.

జలయజ్ఞం.. ఎప్పటి కలో!

గుల్బర్గాలో చదువుకుంటున్నప్పుడు బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాల్వలు, పచ్చదనం ఆయన్ను ఎంతో ఆలోచింపజేశాయి. మన ప్రాంతానికీ ఇలా నీళ్లెప్పుడొస్తాయో అని నాతో అనేవారు. పులివెందులకు నీళ్లు తేవాలనే నాటి ఆలోచనే జలయజ్ఞం పథకానికి మూలం. వ్యవసాయమన్నా, రైతులన్నా ఆయనకెంతో ప్రేమ. అందుకే ధైర్యంగా జలయజ్ఞం మొదలుపెట్టారు.

రోల్ మోడల్

మనం మన కోసం కాదు, జనం కోసమేనన్న భావన ఆయన నరనరాల్లో ఇంకిపోయింది. నిజానికి ఆయనో రోల్ మోడల్. ఆయనలో నచ్చే గుణాలు ఒక్కటని చెప్పలేను. మనిషిలో ఎన్ని సుగుణాలున్నాయో అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయనో మంచి టీచర్. పిల్లలకు మంచి తండ్రి. మనవరాళ్లకు మంచి తాతయ్య. మంచి భర్త. అన్నిటికీ మించి మంచి నాయకుడు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు గానీ మనుషుల్ని పోగొట్టుకుంటే సంపాదించుకోలేం అనేవారు. అందుకే ఆయనకు జనంతో బాంధవ్యం ఎక్కువ. ఏ సమయంలోనైనా వైఎస్‌ను కలవొచ్చు, ఆయన మన మనిషి అనే విశ్వాసాన్ని జనంలో కలిగించాలనేవారు.

కళ్లలోకి చూసి తెలుసుకునేవారు

సీఎంగా ప్రజా దర్బార్‌లో రోజూ ప్రజల్ని కలిసేవాళ్లు. కళ్లలోకి చూసి వాళ్ల బాధను తెలుసుకునేవారు. బాధలో ఉన్నవాళ్ల కళ్లే మాట్లాడతాయనేవారు. 60 శాతం మంది ఆరోగ్య సమస్యలతోనే వచ్చేవాళ్లు. ఆరోగ్య శ్రీ లేనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేసేవారు. చాలామందికి చార్జీలకు, బట్టలకు, మందులకు సొంత డబ్బులిచ్చి పంపేవారు. ప్రభుత్వ సాయం అందిన తరవాత వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉత్తరాలు రాసేవారు. ఆపరేషన్ తరవాత మందులకు డబ్బులు లేవని వాళ్లు రాస్తే పంపేవారు.

కష్టాల్లో వున్నప్పుడే పలకరించాలి

ఆయన ఏం చేయాలనుకుంటే అది చేసేవారు. ఎంతటి కష్టాన్నయినా భరించేవారు. ప్రజల మధ్య తిరిగేవాడికి ఓర్పు, సహనముండాలి, కష్టానికి భయపడకూడదనేది ఆయన తత్వం. ఆయన క ష్టాన్ని చూడడానికి నేను అలవాటు పడిపోయాను. అయితే మండుటెండల్లో పాదయాత్రకు పూనుకున్నప్పుడు మాత్రం నాకు నిజంగా భయమేసింది. ఎన్నడూ దేనికీ అడ్డం చెప్పని దాన్ని మొదటిసారి పాదయాత్రను సెప్టెంబర్‌కు వాయిదా వేసుకోమన్నాను. కానీ ప్రజలు కష్లాల్లో ఉన్నప్పుడే మనం వాళ్ళ దగ్గరకెళ్లాలంటూ బయల్దేరారు. లక్షల మందిని కలుసుకున్నారు. అన్ని వర్గాల కష్టాలను కళ్లారా చూశారు. యాత్ర ముగిశాక జనం కష్టాలు గుర్తు చేసుకుని బాధపడేవారు. ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు ప్రధాని సహా అంతా వ్యతిరేకించారు. కానీ రైతులకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎట్లాగంటూ ఆయన అనుకున్నది చేశారు. నెలకు 75 రూపాయల పెన్షన్ కోసం వృద్ధులు మూడు నెలల దాకా ఎదురు చూసేవాళ్లు. వారికి నెల నెలా ఒకటో తేదీకల్లా అందేలా చేసారు. వాళ్లంతా వైఎస్‌ను తమ పెద్ద కొడుకన్నారు. మహిళలకు సాయం చేసినప్పుడు ఓ తండ్రిలా ఆనందించేవారు. మీకు నేనున్నానని అన్ని వర్గాలకూ చెప్పడమే కాదు, చేసి చూపించేవారు. ప్రజల దీవెనలే ఈ రోజు జగన్‌కు శ్రీరామరక్ష.

ప్రజల కోసమే ప్రభుత్వం

మనిషికి ముఖ్యంగా ఏం కావాలో దాన్నే ప్రజలకు ప్రభుత్వమివ్వాలి. అందుకే ఆయన రెండు రూపాయల బియ్యమిచ్చారు. 80 లక్షల ఇళ్లు కట్టించాలన్న ఆయన ఆశ సగమే నెరవేరింది. ఏదైనా సభకు వెళ్లినప్పుడు మాకిది అందలేదని ఎవరూ చెయ్యి ఎత్తకూడదనేవారు. ఆయన సంకల్ప బలానికి తోడు పంటలు బాగా పండాయి. గిట్టుబాటు ధర లేదనో, పన్నులేశారనో ప్రజలు బాధపడింది లేదు. మంచి రాజు, మంచి మనసు ఉంటే ప్రకతి కూడా సహకరిస్తుంది. ఇప్పుడెవరూ మనసుతో ఆలోచించడంలేదు. రైతులకే కాదు, ఎవరికీ కరెంటు లేదు. ఏ వర్గాన్ని కదిలించినా అనేక ప్రశ్నలే. సమస్యలే. బాధలే. జవాబు చెప్పేవాళ్లు, ఆదుకునే వారు లేరు. పేద పిల్లల ఫీజు విషయంలో కూడా పూర్తిగా ఇవ్వలేమంటున్నారు. రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరు. సారుంటే ఇట్లా ఉండేది కాదని అంటున్నారు. కానీ ప్రజల కోసం ఇంత చేసిన ఆయన పేరు, బొమ్మ వద్దంటున్నారిప్పుడు. చేయాలనుకునే వాళ్లకు నిజానికి పేర్లు, బొమ్మలు అడ్డొస్తాయా?

సీఎం అయ్యాకే

1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి సీఎం అయ్యేదాకా కుటుంబ సభ్యులతో పెద్దగా గడిపింది లేదు. ఎప్పుడూ జనంలోనే. సీఎం అయ్యాకే మాతో రోజూ గడిపే అవకాశం వచ్చింది. కనీసం రోజుకు అరగంటయినా మాట్లాడేవారు. అయితే ఏ హోదాలో ఉన్నా, ఎక్కడున్నా రోజూ రాత్రి భోంచేశాక పిల్లల గురించి కనుక్కునేవారు. వాళ్లు మేల్కొని ఉంటే ఫోన్లో మాట్లాడేవారు. వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం. ఏనాడే వాళ్లను ఒక మాటన్నది లేదు. ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ ఆంక్షలు పెట్టింది లేదు. క్రమశిక్షణ గురించి మాత్రం చెప్పేవారు. మనకు క్యారెక్టరుండాలని అనేవారు. పై చదువులకు జగన్‌ను అమెరికా పంపాం. నేనుండగలిగాను గానీ ఆయన ఉండలేకపోయారు. జగన్ కూడా నెలకు మించి ఉండలేక వచ్చేశాడు.

మొదట్లో కష్టంగా వుండేది

ఆయన తీరు చూసి మొదట్లో కష్టంగా అనిపించింది. తరవాత అలవాటయింది. సీఎంగా ప్రజల కోసం చేసిన పనులు, ప్రజలు ఆయన్ను అభిమానిస్తున్న తీరు చూసి కారణజన్ముడని అనిపించింది. ఆయన అందరివాడు. అందుకే ఆయన పోయినప్పుడు రాష్ట్రమంతా బాధపడింది. ప్రతి కుటుంబమూ కొడుకునో, అన్ననో, తమ్ముడినో కోల్పోయినట్టుగా విలపించింది. ఆయన మృతిని తట్టుకోలేక 700 మందికి పైగా కన్నుమూశారు.

ఎస్టేటంటేప్రాణం

ఇడుపులపాయ ఎస్టేటంటే ఆయనకు ప్రాణం. చెట్లు, నెమళ్లు, ఆవులను ఎంతగానో ప్రేమించే వారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉదయమే ఎస్టేట్ మేనేజర్‌కు ఫోన్ చేసి పశువులెలా ఉన్నాయి, మొక్కలెలా పెరుగుతున్నాయని అడిగి తెలుసుకునేవారు. నెలకో, రెండు నెల్లకో ఒకసారైనా ఇడుపులపాయకొస్తే కలసి వాకింగ్ చేసేవాళ్లం. పసిబిడ్డల ఎదుగుదలను చూసినట్టుగానే చెట్లను చూసేవారు. ఎస్టేట్‌లోని రెండు కొండల మధ్య నుంచి వచ్చే సూర్యోదయం చూడటానికి కుర్చీలు వేసుకుని కూర్చునేవాళ్లం. బిజీగా ఉండి ఎస్టేట్‌కి రావడం కుదరకపోతే హోంసిక్ ఫీలయ్యేవారు.

పంచె కట్టే అందం

పంచె కట్టే ఆయనకు చాలా అందంగా ఉండేది. ఎలా కడతారో గానీ రోజంతా కనీసం నలిగేది కూడా కాదు. ఎక్కడికైనా పోతే విప్పిన బట్టలను ఆయనే ఇస్త్రీ చేసినంత నీట్‌గా మడిచి సూట్‌కేసులో సర్దుకునేవారు. రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేసేవారు. అర్ధరాత్రి 1, 2 గంటలప్పుడొచ్చినా విధిగా స్నానం చేసేవారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండాలనుకునేవారు. ఇంట్లో కూడా పేపర్ చదివాక చక్కగా మడిచి నీట్‌గా పెట్టేవారు. ఫర్నీచర్ కూడా చిందరవందరగా ఉంటే ఇష్టపడేవారు కాదు. వీలైతే తానే సర్దేవారు. ఎవరి ఇంటికైనా వెళ్తే పేపర్లు,కుర్చీలు, టీపాయ్‌లు అడ్డదిడ్డంగా ఉంటే ‘ఇదిలా ఉంటే బాగుంటుందేమో’ అని వారికి చెప్పి సర్దించేవారు.

వేళకు జరిగి తీరాల్సిందే

రాజశేఖరరెడ్డిగారికి టైం సెన్స్ ఉండేది. ఫలానా సమయానికి ఫలానా చోటికి వెళ్లాలంటే వెళ్లి తీరాల్సిందే. సీఎం కాక ముందు రాత్రి 11కు పడుకుని ఉదయమే ఐదింటికి లేచేవారు. సీఎం అయ్యాక మాత్రం 4.30కే లేచేవారు. 5.30 నుంచి 6.30 వరకు ఇంట్లో అందరితో మాట్లాడేవారు. తర్వాత ప్రజా దర్బార్, ఇతర కార్యక్రమాలు. బయట ఎన్ని టెన్షన్లున్నా ఇంటికొచ్చాక ఆ ప్రభావం పడనిచ్చేవారు కాదు. మాతో బాగా మాట్లాడే వారు. కొన్నిసార్లయితే ఫోన్ కూడా పక్కన పెట్టేసేవారు. ఈ టైం సెన్స్ వల్లే ఆ రోజు (2009 సెప్టెంబరు 2) కుంభవష్టిలోనూ రచ్చబండకు బయల్దేరారు.

కష్టాలే ఎక్కువ

రాజశేఖరరెడ్డి గారి రాజకీయ జీవితంలో కష్టాలే ఎక్కువ. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవారు. జనం ఎన్టీఆర్‌ను దేవునిగా చూసేవారు. అప్పట్లో కాంగ్రెస్‌లో పని చేసేవారు తక్కువ. ఒక్క మీటింగ్ పెట్టాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. మండల, పంచాయతీ ఎన్నికలు జరిగినా పీసీసీ అధ్యక్షుడు వెళ్లాల్సిన పరిస్థితి. ఆర్థికంగా పార్టీ సాయపడింది కూడా లేదు. ఆస్తులమ్మి పార్టీ కోసం పని చేశారు. ఇందిర, రాజీవ్‌గాంధీలతో ఆయనకెంతో సన్నిహిత సంబంధాలుండేవి. అయినా కాంగ్రెస్‌లో ఒక అడుగు ముందుకేస్తే పదడుగులు వెనక్కు లాగేవారు. రాజీవ్ ఆయన్ను కేంద్రంలోకి రావాలని పిలిచినా పెద్దగా చేసిందేమీ లేదు. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అంతా రాజశేఖరరెడ్డి గారు సీఎం అవుతారని భావించారు.

అయినా అధిష్టానం అవకాశమివ్వలేదు. 1989-94 మధ్య కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉండగా మా మైనింగ్ లీజులు రద్దు చేశారు. అయినా ఆయన ఏనాడూ భయపడలేదు. ఆయనకు విల్‌పవర్ ఎక్కువ. ఎన్టీఆర్, బీజేపీ వాళ్లు కూడా ఆయన్ను వాళ్ల పార్టీలోకి పిలిచారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఆయన కాంగ్రెస్‌ను విడిచి పోవాలని అనుకోలేదు. 2004 నాటికి వైఎస్‌కు రాష్ట్రంలో తిరుగులేని అభిమానం, ప్రజా బలం లభించాయి. ఇప్పుడు కూడా ఆయన్ను సీఎంగా చేయకపోతే వేరే పార్టీ పెడతారేమోననే అభద్రతా భావంతోనే కాంగ్రెస్ అధిష్టానం సీఎం చేసింది. 2009లో పార్టీని ఒంటిచేత్తో నడిపించి మరోసారి సీఎం అయ్యే అవకాశం ఆయనే తెచ్చుకున్నారు. ఆయనలాగే మేం కూడా కాంగ్రెస్‌ను విడిచి పోవాలని ఏనాడూ అనుకోలేదు. చెప్పుడు మాటలు వినే కాంగ్రెస్ అధిష్టానం తీరు వల్లే అనివార్యంగా బయటకు రావాల్సి వచ్చింది. వివేకానందరెడ్డికి మంత్రి పదవి వచ్చినందుకు మేము కూడా ఎంతో సంతోషించాం. కానీ దాన్ని ఆయుధంగా చేసుకుని మా కుటుంబంలో చీలిక తేవాలనుకోవడం మమ్మల్ని బాధపెట్టింది. దాంతో పార్టీ వీడక తప్పలేదు.

నాయనలా బతుకుతానన్నాడు

ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉండటం, రాజకీయంగా పడుతున్న ఇబ్బందులు చూసి ఒకరోజు నేను జగన్‌తో ‘‘నాయనతో మనం ఎక్కువగా గడపలేకపోతున్నాం. ఆయన కూడా ఫ్యాక్టరీలు పెట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు కదా. మనకెందుకీ ఇబ్బందులు?’’ అని అన్నాను. అప్పుడు జగన్, ‘నాయన ప్రజల కోసం బతుకుతున్నాడు. నేను కూడా నాయన లాగే బతకాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.

పాత పాటలంటే ఇష్టం

రాజశేఖరరెడ్డి గారికి పాత పాటలంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడు, కారులో వెళ్లేటప్పుడు వాటిని వినేవారు. తీరిక లేకపోవడం వల్ల పెద్దగా సినిమాలు చూసేవారు కాదు.

మా నాయన పెట్టిన పేరది

మా నాయనకు జాతకాల మీద బాగా గురి. వాటి గురించి ఆయనకు బాగా తెలుసు. జగన్ పుట్టినప్పుడు టైం, నక్షత్రాలు అన్నీ లెక్క చూసి ‘జ’తో పేరు పెట్టాలని నిర్ణయించారు. జగన్నాథరెడ్డి, జయసింహారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అని నాలుగైదు పేర్లు చెప్పారు.

పాస్ మార్కులేనని బాధపడ్డారు

2009లో కనీసం 185 సీట్లు వస్తాయని ఆయన గట్టిగా నమ్మారు. జనం 156 సీట్లే ఇచ్చారు. ఇన్ని సంక్షేమ, అభివద్ధి పథకాలు అమలు చేసినా జనం పాస్ మార్కులే ఇచ్చారని బాధపడ్డారు. పథకాలన్నీ జనానికి పూర్తిగా చేరడం లేదని గ్రహించి, వారికి మరింత దగ్గరవడం కోసమే రచ్చబండ రూపొందించారు.

వస్తారనుకున్నాం

2009 సెప్టెంబరు 2న కుంభవృష్టిలోనే రచ్చబండ కోసం చిత్తూరు బయల్దేరుతున్నారు. ఇంత వానలోనూ పోవాలా అని అడిగాను. జనం తనకోసం ఎదురు చూస్తుంటారని చెప్పి బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రేయర్ ముగించుకుని కిందకొస్తే, ఆయన హెలికాఫ్టర్ మిస్సయిందని చెప్పారు. ఆయనకేమీ కాదని, క్షేమంగా వస్తారని అనుకున్నా. కొంతసేపటి తర్వాత టీవీ పెడితే రకరకాల వార్తలొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక రూములోనే కూర్చుండిపోయాను. రాత్రంతా గడిచింది. అయినా ఆయన తిరిగి వస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. మర్నాడు ప్రేయర్ జరుగుతుంటే జగన్ బాబు, కేవీపీ వచ్చి హెలికాప్టర్ కూలిపోయిన విషయం చెప్పారు. నేను నమ్మలేదు. అక్కడికి పోదామన్నాను. వాళ్లు అలాగేనన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తు లేదు. ఇప్పటికీ ఆయన ఫొటోను తదేకంగా ఒకట్రెండు నిమిషాలు చూస్తే నా కళ్లలో నీళ్లొస్తాయి (కళ్లలో సుడులు తిరిగాయి). అందుకే ఆయన ఫొటోను కూడా నేను ఎక్కువగా చూడను.

వెంటనే సీఎం అయ్యుంటే ఎవరేమిటో తెలిసేది కాదు

ఆయన చనిపోతూనే జగన్ బాబు సీఎం అయ్యుంటే ఎవరు ఎవరో, ఎవరేమిటో తెలిసేది కాదు. దేవుడు ఓదార్పు యాత్ర ఎందుకు చేయమని చెప్పాడో! జగన్ పెరిగిన వాతావరణం కాంగ్రెస్‌కు సరిపోదనుకుని దేవుడే మమ్మల్ని బయటకు తెచ్చాడేమో! మంచి రాజు కావాలంటే ప్రజల కష్టసుఖాలు బాగా తెలిసుండాలి. అందుకే అవి తెలుసుకోవడానికే దేవుడు జగన్‌ను ఇలా నడిపిస్తున్నాడు. ఆయన చనిపోయినప్పుడు క్యాంప్ ఆఫీసులో కుటుంబీకులమంతా ఒకచోట కూర్చుని ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ఇంట్లో ఎక్కడ చూసినా ఆయన కోసం వచ్చిన జనమే. ఆ తర్వాత కూడా జనం మమ్మల్ని ఓదార్చడానికి రోజూ వేలాదిగా క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. అంత బాధలో కూడా జగన్ బాబు బయట నిలబడి వచ్చిన వారందరినీ పలకరించి పంపాడు.

మనల్ని ఓదార్చడానికి ఇంతమంది వస్తే, నాయన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబాలను పలకరించి ఓదార్చాల్సిన బాధ్యత మనకుంది కదా అని జగన్ ఆనాడే చెప్పాడు. ఇది రాజకీయంతో సంబంధం లేకుండా దేవుడిచ్చిన ఆజ్ఞ. అందుకే నల్లకాల్వలో ఓదార్పు యాత్ర ప్రకటన చేశాడు. మాటకు కట్టుబడి యాత్ర చేయాలనుకున్నాం. కాంగ్రెస్ అధిష్టానానికి మా వ్యతిరేకులు పితూరీలు మోశారు. సోనియా ఓదార్పు యాత్ర వద్దన్నారు. జిల్లాకో చోట విగ్రహం పెట్టి అక్కడికే అందరినీ పిలిపించి పలకరించి పంపమన్నారు. ఆ మాటలు మమ్మల్నెంతో బాధపెట్టాయి. మాటిస్తే తప్పని వ్యక్తి కొడుకుగా జగన్ కూడా మాట మీదే నిలవాలనుకున్నాడు.

ఆ ప్రయత్నంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి మేం కాంగ్రెస్‌లోనే ఉన్నాం. జగన్ ఓదార్పు యాత్రకు రావద్దన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది స్వచ్ఛందంగా వచ్చారు. వైఎస్‌కు గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజలు జగన్ బాబును ఎంతగానో ఆదరించారు. ఓదార్పు యాత్ర ఇలా జరుగుతుందనీ, ఇంత అభిమానం కురుస్తుందనీ మేం కూడా అనుకోలేదు. ఆ తర్వాత మమ్నల్ని ఎలా ఇబ్బంది పెట్టారో, మేమెందుకు బయటికొచ్చి పార్టీ పెట్టామో అందరికీ తెలుసు. ప్రజల కోసం అన్నీ చేయాలని కలలు గన్న రాజశేఖరరెడ్డి గారి కోరికలో దేవుడు జగన్‌కూ భారం పెట్టాడు. ప్రజల కష్టసుఖాలను దగ్గరిగా చూసి వారి బాధలు పంచుకున్న జగన్‌ను సీఎం చెయ్యాలని జనం డిసైడయ్యారు. అతను కూడా నాన్న ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. పూర్తి చేస్తాడు. అందుకు నేను చేయగలిగినంతా చేస్తాను. నేను దేవున్ని నమ్ముతాను. ఆయన ఏ తప్పూ చేయలేదు. జగన్ కూడా ఏ తప్పూ చేయలేదు. న్యాయం, ధర్మం మా పక్షానున్నాయి. దేవుడి దయతో జగన్‌బాబు త్వరలోనే బయటకొస్తాడు.

తప్పును అంగీకరించేవారు

రాజశేఖరరెడ్డి గారికి సెల్ఫ్ చెకింగ్ ఎక్కువ. తాను తప్పు చేశానా, ఒప్పు చేశానా అని చెక్ చేసుకునేవారు. తప్పు చేసినట్టు అనిపిస్తే సరిచేసుకునే వారు. తప్పును అంగీకరించేవారు కూడా. ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటే ఎవరేమనుకున్నా భయపడేవారు కాదు.
ఇద్దరిదీ ఒకటే గుణంపజలతో వ్యవహరించే విధానం, వారిని ఆప్యాయంగా పలకరించే తీరులో రాజశేఖరరెడ్డి గారు, జగన్‌ది ఇద్దరిదీ ఒకటే గుణం. ఆయనలాగే జగన్ కూడా జనానికి దగ్గరయ్యాడు. వారితో ఆత్మీయత పంచుకుంటున్నాడు. ‘‘నేను 30 ఏళ్లు కష్టపడి సంపాదించిన జనాన్ని, మంచి పేరును నువ్వు మరింత పెంచుకోవాలి’’ అని 2009లో జగన్‌ను పోటీ చేయించేప్పుడు ఆయన చెప్పారు. జగన్ దాన్ని నిజం చేస్తున్నాడు. రెండున్నరేళ్లుగా జనంలోనే ఉంటూ, రాజశేఖరరెడ్డి గారు ఇచ్చి వెళ్లిన కుటుంబాన్ని (ప్రజలను) తన కుటుంబంగా భావిస్తున్నాడు. జగన్ కష్టం చూస్తే బాధనిపిస్తుంది. కానీ ఇది వాళ్ల నాన్న ఆశయ సాధనకు, పేదలకు మేలు చేయడానికి చేస్తున్న కష్టం కాబట్టి నన్ను నేనే తమాయించుకుంటాను.

కృతజ్ఞత ఉండాలి

తన మనుషులనుకునే వారికి ఎందరికి రాజశేఖరరెడ్డి గారు ఎంత సాయం చేశారో ప్రజలకు తెలుసు. ఎంతమందికి రాజకీయ జీవితం ఇచ్చారో కూడా తెలుసు. మనుషులకు కృతజ్ఞత ఉండాలి. అది లేనివారి విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అదేమో గానీ రాజశేఖరరెడ్డి గారు సాయం చేసిన చాలామంది ఆయన నెత్తినే చెయ్యి పెట్టేవారు. కానీ దేవుడే ఆయనకు అండగా నిలిచాడు.

మూడేళ్లు గడిచినా...

రాజశేఖరరెడ్డి గారు మరణించి అప్పుడే మూడేళ్లు గడుస్తున్నా ఆయన లేరనే విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ప్రజలు ఆయన్ను తమ మనసుల్లో పదిలం చేసుకున్నారు. వారి అభిమానాన్ని మా కుటుంబం ఎన్నటికీ మరచి పోలేదు. రాజశేఖరరెడ్డి గారు ప్రజలకు ఏ మేళ్లు చేయాలనుకున్నారో అవన్నీ నెరవేర్చడానికి మేం కట్టుబడి ఉన్నాం. మా కుటుంబం మీద ఇంత అభిమానం చూపుతున్న రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు.